చెక్‌డ్యాం నిర్మాణం కలేనా?
ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయి ఆరేళ్లు
మంగపేట: మండల పరిధిలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి కొత్త చీపురుదుబ్బ గ్రామానికి సమీపంలో గల కప్పవాగుపై చెక్‌డ్యాం నిర్మాణం కలగానే మిగిలింది. గిరిజన, గిరిజనేతర రైతులకు చెందిన వందలాది ఎకరాలకు సాగునీరు అందించే చెక్‌డ్యాం కనీసం ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయి ఆరేళ్లు గడిచింది. పునఃనిర్మాణం కోసం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా హామీలకే పరిమితమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఆదివాసీ గిరిజన రైతులకు శాపంగా మారింది.
నిత్యం పారే కప్పవాగు
మండలంలోని దోమెడ అటవీ ప్రాంతం నుంచి ఊటతోగులు, వాగుల నుంచి నిత్యం జీవనదిలా పారే కప్పవాగు నీటిని ఆదివాసీ గిరిజనుల భూములకు సాగునీటికి మళ్లించేందుకు రూపకల్పన చేశారు. ఈ మేరకు 1986లో అప్పటి ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ సీవీఎస్‌కే శర్మ వీడీసీ కమిటీ పర్యవేక్షణలో లక్షల రూపాయలు వెచ్చించి కప్పవాగుపై చెక్‌డ్యాంను నిర్మింపజేశారు. చెక్‌డ్యాం నిర్మాణంతో పాతచీపురుదుబ్బ, కొత్తచీపురుదుబ్బ, సంఘంపల్లి (రామచంద్రునిపేట) గ్రామాల గిరిజన రైతులకు చెందిన సుమారు 600 ఎకరాల భూములతో పాటు చెక్‌డ్యాం కింది ప్రాంతమైన నడిమిగూడెం, రాజుపేట, పెరకలకుంట గ్రామాలకు చెందిన గిరిజన, గిరిజనేతర భూములకు సాగునీరు అందింది. 20 ఏళ్ల నుంచి చెక్‌డ్యాం పరిరక్షణపై ఐటీడీఏ అధికారులు, ఇంజనీరింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో ప్రతిఏటా వాగు వరద ఉధృతికి కోతకు గురికావడం, లీకేజీలు ఏర్పడటంతో శిథిలావస్థకు చేరింది. చెక్‌డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయకట్టు పరిధిలోని గిరిజన రైతులు అధికారులకు లిఖిత పూర్వకంగా వినతులు సమర్పించినా పట్టించుకోక పోవడంతో 2019లో చెక్‌డ్యాం ఆనవాళ్లు లేకుండా కొట్టుకు పోయి ఆరేళ్లు అయ్యింది. అయినా దాని నిర్మాణం ఊసే లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. వందలాది ఎకరాల్లోని రెండు పంటలకు నిత్యం నీరందించే తోగుల వాగు నీరు వృథాగా వెళ్లి గోదావరిలో కలుస్తుంది.
అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం
వృథాగా పోతున్న కప్పవాగునీరు
సాగునీటి కోసం గిరిజన రైతులకు తప్పని తిప్పలు
చెక్‌డ్యాం నిర్మాణం కలేనా?


