ఎన్నికల నిబంధనలు పాటించాలి
ములుగు రూరల్: ఎన్నికల సంఘం నియమ నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం రెండో విడతలో మల్లంపల్లి, ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు శిక్షణ తరగతులను వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మల్లంపల్లి, ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల్లో ఈ నెల 14వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికల విధుల్లో పాల్గొనాలని సూచించారు. రెండో విడత పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు అధికారులు సకాలంలో చేరుకోవాలని, సదుపాయాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటింగ్ కంపార్ట్‌మెంట్, సిట్టింగ్ ఏర్పాట్లను నిబంధనలకు అనుగుణంగా చూసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్ తప్పనిసరిగా సరిచూసుకోవాలన్నారు. ఎన్నికల విధులను సజావుగా నిర్వహించాలని సూచించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఆర్వోలు, ఏఆర్వోలు, ఏపీఓలు పాల్గొన్నారు.
ఎన్నికల సాధారణ పరిశీలకుడు
ప్రశాంత్‌కుమార్
ఎన్నికల నిబంధనలు పాటించాలి


