ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్
● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మొదటి, రెండో దశ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా సంబంధిత గ్రామాలు, మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని తెలిపారు. మూడో దశలో ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోతుందన్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో జిల్లాలోని సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు, ప్రజలు నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జీపీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఖర్చు పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.


