
పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి
ములుగు: శాంతిభద్రతల కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని, వాటిని స్మరించుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ 21 అక్టోబర్ 1959లో చైనా సరిహద్దు లడాఖ్‌లోని హార్ట్‌స్ప్రింగ్స్ వద్ద చైనా దళాల దాడిలో పదిమంది ధైర్యవంతులైన భారతీయ సైనికులు సరిహద్దులను కాపాడుతూ వీరమరణం పొందారని తెలిపారు. ఈ ఘటనకు స్మారకార్ధంగా ప్రతీ ఏడాది అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్‌డేని నిర్వహిస్తున్నారన్నారు. అమరవీరుల పేర్లు స్మారక స్తూపాలపై చెక్కబడి ఉండొచ్చు గాని వారి ధైర్యం మనందరిలో సజీవంగా ఉన్నాయన్నారు. పోలీసు అనేది ఉద్యోగం కాదని ఒక బాధ్యత అన్నారు. జిల్లాలో అటవీ ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత మండలాలు, ఏజెన్సీ దూర గ్రామాలు ఉన్నప్పటికీ పోలీసులు ధైర్యంగా నిబద్ధతతో విధులను నిర్వహిస్తున్నారని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడంలో ములుగు పోలీసులు నిరంతరం ముందంజలో ఉన్నారని వెల్లడించారు. 2024 నుంచి 2025 వరకు దేశవ్యాప్తంగా ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల వివరాలను తెలియజేస్తూ వారిని స్మరిస్తూ నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, డీసీఆర్‌పీడీ ఎస్పీ కిశోర్‌కుమార్, సీఐలు శ్రీనివాస్, దయాకర్, సురేష్, రమేష్, ఆర్‌ఐలు స్వామి, సంతోష్, తిరుపతి, వెంకటనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ డాక్టర్ శబరీశ్
టీజీఎస్పీ 5వ బెటాలియన్‌లో..
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి 5వ బెటాలియన్‌లో గల అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని(ఫ్లాగ్ డే)మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ సుబ్రహ్మణ్యం హాజరై అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మన దేశంలో విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు కమాండెంట్ సీతారామ్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా కమాండెంట్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిషలు కృషి చేసి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం అన్నారు. విధి నిర్వహణలో ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన పోలీసుల త్యాగాలు నేటి పోలీసులకు స్ఫూర్తి దాయకం అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్‌లు అనిల్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌లు భాస్కర్, సాయి బాబు, వెంకటేశ్వర్లు, బెటాలియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి