
కోతుల బెడద నివారించాలి
ములుగు రూరల్: కోతుల నుంచి ప్రజలు, పంటలకు రక్షణ కల్పించడంతో పాటు వాటి బెడదను నివారించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలో అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డివిజనల్ రేంజ్ అధికారి డోలి శంకర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోతులు ఇళ్లలో చొరబడి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. అలాగే పొట్ట దశలో ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరటి సాగులో కూరగాయలను సైతం నాశనం చేస్తున్నాయని వివరించారు. కోతుల దాడుల కారణంగా పలువురు గాయాలపాలయ్యారని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి గఫూర్‌పాషా, ఐలయ్య, ప్రవీణ్, రాజు, కోటయ్య, రవీందర్, రామస్వామి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
అటవీశాఖ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకుల ధర్నా