
నాణ్యతపై నజర్
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలోని పల్లెల్లోనే సంపద సృష్టించాలి. ఇందుకోసం కులవృత్తులను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వమే చేపపిల్లలను కొనుగోలు చేసి మత్స్యపారిశ్రామిక సంఘాల సమక్షంలో చెరువుల్లో విడుదల చేస్తుంది. అయితే గతంలో ఈ పంపిణీలో పలు అవకతవకలు జరిగినట్లు విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. పిల్లలు నాసిరకంగా ఉన్నాయని.. లెక్కల్లో తేడా ఉందని పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం చేపపిల్లల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో గత అనుభవాలను తలచుకుంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన చేపపిల్లలను చెరువుల్లో వదిలి తమ ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పంపిణీకి అధికారుల కసరత్తు
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు తొందరగానే కురిశాయి. చెరువుల్లో నీరు చేరగానే చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, టెండర్ల ప్రక్రియతో ఆలస్యం అయింది. మత్స్యకారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఎట్టకేలకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని చేపపిల్లల పంపిణీకి కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 26,357 చెరువులు చేపపిల్లలు వదిలేందుకు అనువైనవిగా గుర్తించారు. 35–40, 80–100 సైజు మొత్తం 8,386.24 లక్షల చేపపిల్లలు, రొయ్యలను పోసేందుకు కాంట్రాక్టర్లకు టెండర్లు అప్పగించారు. దీంతో జిల్లాల్లోని ప్రజా ప్రతినిధుల సమయం తీసుకొని చేపపిల్లలు చెరువుల్లో వదిలేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
గతంలో ఆరోపణలు
గతంలో ఉత్పత్తి చేసే కేంద్రాలు లేకపోయినా.. కొందరు కాంట్రాక్టర్లు వేరే హేచరీలను చూపించి కాంట్రాక్టు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం కాకుండా నాసిరకం పిల్లలు పంపిణీ చేశారని, దీంతో పలు చెరువుల్లో ఆరు, ఏడు నెలలు గడిచినా.. చేపలు 500 గ్రాముల సైజుకు కూడా రాలేదనే ఆరోపణలు మత్స్యకారుల నుంచి వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చేపపిల్లలను చెరువుల్లో విడిచే సమయంలో తక్కువ పిల్లలు పోసి లెక్కలు ఎక్కువ చూపించినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. అయితే వీటిని పరిశీలించాల్సిన అధికారులు కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడం, ముడుపులు తీసుకొని చూసీ చూడనట్లు ఉన్నారనే ఆరోపణలు కూడా మత్స్యకారుల నుంచి వ్యక్తమయ్యాయి.
నాసిరకం చేపపిల్లలు.. లెక్కల్లో తేడాలు..
ఎదగని పిల్లలతో మత్స్యకారుల ఇబ్బందులు
గత అనుభవాలతో మత్స్యకారుల ఆందోళన
ప్రస్తుతం చేపపిల్లల ఉచిత పంపిణీకి కసరత్తు