
అకాల వర్షం.. నేలవాలిన వరి
● దిక్కుతోచని స్థితిలో రైతన్నలు
ములుగు రూరల్: ఆరుకాలం కష్టపడి రైతులు పంటలు సాగు చేస్తే అకాల వర్షం నేలపాలు చేసింది. జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మల్లంపల్లి మండలంలోని రాంచంద్రాపూర్, నిమ్మనగర్ గ్రామాలలో వరి పంటలు పూర్తిగా నేలవాలాయి. రైతులు ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయానికి దెబ్బతినడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాంచంద్రాపూర్, నిమ్మనగర్ గ్రామాలలో సుమారు 100 ఎకరాల్లో వరిపంట నేలవాలింది. మల్లంపల్లి మండల పరిధిలో బోరుబావులపై ఆధారపడిన రైతులు ముందస్తుగా నాట్లు వేశారు. వరిధాన్యం చేతికొచ్చే సమయానికి కురిసిన అకాల వర్షానికి పంట దెబ్బతింది. వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.