
పోషణ్ అభియాన్ విజయవంతం చేయాలి
ములుగు రూరల్: పోషణ్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సీడీపీవోలు, పోషన్ అభియాన్ సిబ్బంది, మెడికల్ హెల్త్, పంచాయతీ రాజ్, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ పోషణ్ అభియాన్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల కోఆర్డినేషన్‌తో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతీ గ్రామంలో పోషణ్ అవగాహన ర్యాలీలు, వాణిజ్య ప్రదర్శనలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ ర్యాలీలు, వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. గర్భిణులు, చిన్నారులకు పోలిక్ యాసిడ్, ఐరన్ మాత్రలు ఇవ్వాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోషకాహారానికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. అనంతరం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సమస్యలను నివారించి ఆరోగ్య మహిళలుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారి స్వశక్తిపరివార్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర