
రూ.100 కోట్లు కేటాయించాలి
రహదారుల మరమ్మతులకు
వెంకటాపురం(కె): మండలంలోని ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతులకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని యాకన్నగూడెం నుంచి మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెబుతున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మండలంలో ఏం అభివృద్ధి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఆయన గాలికి వదలడం సరికాదన్నారు. ఎమ్మెల్యే వైఫల్యం కారణంగానే రోడ్లు అధ్వానంగా మారాయని విమర్శించారు. ఒక్కొక్క ఇసుక లారీ నుంచి ప్రభుత్వం టాక్స్‌ల పేరుతో రూ.1340 వసూలు చేస్తూ రోడ్ల ను ఎందుకు మరమ్మతులు చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, మండల కార్యదర్శి గ్యానం వాసు, నాయకులు కుమ్మరి శ్రీను, కట్ల నర్సింహచారి, తోట నాగేశ్వరావు, కుంజా శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణారెడ్డి