
జీపీఓలు వస్తున్నారు..
వెంకటాపురం(ఎం): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామపాలన అధికారులు రానే వచ్చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు 1న వీఆర్‌ఓ వ్యవస్థను, 10వ తేదీన వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర శాఖలకు బదలాయించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేయడంతో పాటు గతంలో ఉన్న వీఆర్‌ఏ, వీఆర్‌ఓలను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో 97 మంది దరఖాస్తు చేసుకోగా వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారిని జీపీఓలుగా ఎంపిక చేశారు. ఈనెల 5న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జిల్లాకు చెందిన 47 మంది గ్రామపాలన అధికారులు నియామక పత్రాలు అందుకున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో జీపీఓలను గ్రామాలకు కేటాయించనున్నారు. దీంతో గ్రామాల్లో జీపీఓల వ్యవస్థ ప్రారంభమైతే రైతులకు సంబంధించిన భూ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 335 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాలను 99 క్లస్టర్లుగా విభజించారు. ప్రతీ క్లస్టరుకు ఒక జీపీఓను కేటాయించి బాధ్యతలను అప్పగించనున్నారు. జిల్లాలో 99 క్లస్టర్లకు 47 మంది జీపీఓలను (గ్రామపాలన అధికారులు) మాత్రమే ఎంపిక చేయడంతో మిగిలిన 52 క్లస్టర్లలో రెవెన్యూశాఖలో పనిచేస్తున్న జూనియర్ ఆసిస్టెంట్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. కొత్తగా గ్రామాల్లో బాధ్యతలు చేపట్టే గ్రామపాలన అధికారులు పల్లెల్లో ప్రజలతో నిత్యం మమేకమై పని చేయాల్సి ఉంటుంది. భూమి వివాదాల పరిష్కారం, కొలతలు, పహాణీల సవరణలు, ఎన్నికల విధులు, ఓటరు జాబితా పనులు, గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రజా సమస్యలు, పరిపాలన సమస్యలు పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది.
గతంలో పనిచేసిన వీఆర్‌ఓలను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకొని గ్రామాలకు జీపీఓలుగా నియమి స్తుండడంతో శాఖాపరమైన ఇబ్బందులు తొలగనున్నాయి. గ్రామస్థాయిలో వీఆర్‌ఏ, వీఆర్‌ఓలు లేక ఆర్‌ఐ(రెవెన్యూ ఇన్స్‌పెక్టర్)లపై అదనపు భారం పడేది. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించిన సమయాల్లో, విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, విచారణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం గ్రామాల్లో గ్రామపాలన అధికారుల వ్యవస్థ మొదలు కానుండడంతో రెవెన్యూశాఖకు కొంతమేర ఇబ్బందులు తొలగనున్నాయి.
కొండాయి గ్రామం వ్యూ
జిల్లాలో 47 మంది గ్రామాధికారుల నియామకం
సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు
రెవెన్యూశాఖలో తొలగనున్న ఇబ్బందులు
జిల్లాలో 355 గ్రామాలు 99 క్లస్టర్లు

జీపీఓలు వస్తున్నారు..