
అభివృద్ధిపై దృష్టి సారించని మంత్రులు
వెంకటాపురం(కె): జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండలంలోని రోడ్డు సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ముగింపు సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క ఇద్దరు మంత్రులు ఉన్నా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ మారిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. వందలాది ఇసుక లారీల రాకపోకలతోనే రోడ్డు పాడైపోయిందన్నారు. ఇసుక లారీలతో వచ్చే ఆదాయంతో రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమస్యను పరిష్కరించపోతే దశల వారీగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, మండల కార్యదర్శి గ్యానం వాసు, వంకా రాములు, కుమ్మరి శ్రీను, కట్ల నర్సింహచారి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
రంగారెడ్డి