
సర్వేలతో సరి.. అందని పరిహారం
వర్షాలతో 644 ఎకరాల్లో పంటనష్టం
కొండాయిలో ఇసుక మేటలతో ఉన్న పొలాలు
జిల్లాలో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి. వరి, పత్తి, ఇతర పంటలను కోల్పోయిన రైతులను గుర్తించి వారికి పరిహారం అందిస్తే మళ్లీ సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ సర్వేలు చేసి కేవలం కాగితాలకే పరిమితం చేయడం సరికాదు.
– వినుకోలు చక్రవర్తి,
బీజేపీ మండల అధ్యక్షుడు, ఏటూరునాగారం
ఏటూరునాగారం: జిల్లాలో రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు గోదావరితో పాటు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో వరద నీరు వరి, మిర్చి, పత్తి, అరటి తోటల నుంచి ప్రవహించి నష్టానికి గురిచేసింది. దీంతో గత నెలలో వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక సర్వేలు చేపట్టి జిల్లాలో 450 ఎకరాల మేరకు పంటనష్టం వాటిలినట్లు ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు. అయినా రైతులకు ఎలాంటి పంట నష్టపరిహారం అందలేదు. వాటి నుంచి తేరుకోకముందే ఇటీవల కురిసిన వర్షాలకు మరికొన్ని చోట్ల 194 ఎకరాల్లో వరి పంట పొలాల నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించి ఇసుక మేటలు వేసింది. దీంతో మొత్తంగా 644 ఎకరాల్లో పంట నష్టపోయిన అన్నదాతలు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇసుక మేటలు
ఏటూరునాగారం మండల పరిధిలోని కొండాయి గ్రామంలో ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు 25 ఎకరాల్లో పంట నీటి పాలైంది. అలాగే గోగుపల్లి, శివాపురం, చిన్నబోయినపల్లి గ్రామాల్లోని రైతుల పొలాల నుంచి వరద నీరు ప్రవహించడంతో సుమారు 35 ఎకరాల మేర ఇసుక మేటలు వేసింది. భూమి పంటల సాగుకు పనికిరాకుండా పోయింది. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. మంగపేటలో జూలై నెలలో కురిసిన వర్షాలకు 89 ఎకరాలు, ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు 45 ఎకరాల మేరకు పంటలకు నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేశారు. ఇలా మండలాల వారీగా అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నష్టం బయటకు వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.
గోదావరి వరదతో పొలాల్లో ఇసుక మేటలు
ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు

సర్వేలతో సరి.. అందని పరిహారం