
రూ. 21లక్షల కరెన్సీతో అలంకరణ పులి పాదముద్రల గుర్తింపు ప్రచార రథం ప్రారంభం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఇండియన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని మహాలక్ష్మీ అవతారంలో రూ.21 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు యల్లాప్రగడ రాధాకృష్ణశర్మ ప్రత్యేక పూజలను నిర్వహించారు. బుధవారం ఇండియన్ యూత్ మండపం వద్ద కరెన్సీ నోట్లతో అలంకరణ చేయగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కమిటీ వారు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
ములుగు రూరల్: ములుగు మండలంలోని పత్తిపల్లి శివారులో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు బుధవారం గుర్తించారు. అటవీశాఖ రేంజ్ అధికారి డోలి శంకర్ కథనం ప్రకారం... పత్తిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పత్తి చేనులో అడవి జంతువుల పాదముద్రలు ఉన్నాయని అటవీశాఖ కార్యాలయానికి సమాచారం అందించారు. ఈ మేరకు ఎఫ్‌ఆర్‌ఓ సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిశీలించి పెద్దపులి పాదముద్రలుగా గుర్తించామని తెలిపారు. పాదముద్రల ఆధారంగా అటవి ప్రాంతానికి వెళ్లినప్పటికీ ఆచూకీ లభించలేదని తెలిపారు. పాదముద్రల ఆధారంగా మగ పెద్దపులి అని గుర్తించినట్లుగా వివరించారు. పత్తిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, రాత్రిళ్లు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. పశువులు, గొర్రెల కాపరులు అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదన్నారు. అడవి సమీపంలో ఉన్న వ్యవసాయ పంట పొలాలకు రైతులు, కూలీలు వెళ్లొద్దని సూచించారు. పులి కనిపిస్తే సెల్ నంబర్ 9849358923కి సమాచారం అందించాలని తెలిపారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: పంటనష్ట పరిహార సాధన సమితి ఆధ్వర్యంలో మేడారంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. బుథవారం సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన సురేందర్, కొక్కెర కృష్ణయ్య, కమిటీ అధ్యక్షుడు కృష్ణా అర్జున్‌లు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంటనష్ట పరిహార సాధన సమితి అధ్యక్షుడు కృష్ణాఅర్జున్ మాట్లాడుతూ మేడారంలో ఈ నెల 6న పంటనష్ట పరిహారం కోసం నిర్వహించనున్న సమావేశానికి నార్లాపూర్, వెంగ్లాపూర్, బయ్యక్కపేట, కాల్వపల్లి గ్రామ పంచాయతీల్లోని రైతులు హాజరయ్యేందుకు ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు జంగా హన్మంతరెడ్డి, గొంది శ్రీధర్, సమ్మారావు, లక్ష్మణ్, బాబురావు పాల్గొన్నారు.