
గోదావరి పరవళ్లు
కన్నాయిగూడెం/వాజేడు: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద బుధవారం గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దీంతో బ్యారేజీ ప్రాంతమంతా వరద నీటితో జలమయమైంది. బుధవారం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో పాటు సరస్వతీ, లక్ష్మీ, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదులుతుండడంతో సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఉదయం 7,72,748 క్యూసెక్కులకు నీరు వచ్చి చేరగా సాయంత్రం 7,58,013క్యూసెక్కులకు మేర కొంత తగ్గింది. ఒక్కసారిగా గోదావరి భారీగా చేరడంతో ప్రజలు భయానికి గురయ్యారు. అలాగే వాజేడు మండల పరిధిలోని బుధవారం గోదావరి వరద ఉధృతంగా పెరగడంతో టేకులగూడెం చివరన జాతీయ రహదారి ముంపునకు గురైంది. రెండు రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచి పోయాయి. అదే విధంగా పేరూరు–కృష్ణాపురం, ఏడ్జెర్లపల్లి– పూసూరు, వాజేడు– గుమ్మడి దొడ్డి గ్రామాల మధ్యన ఉన్న బ్రిడ్జీలు వరద నీటిలో మునగడంతో పలు గ్రామాలకు రాక పోకలు నిలిచి పోయాయి. అప్రమత్తమైన అధికారులు వరదలోకి ఎవరూ వెళ్లకుండా ట్రాక్టర్లను అడ్డంగా పెట్టారు. పూసూరు గోదావరి బ్రిడ్జి వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.

గోదావరి పరవళ్లు