
ఉధృతంగా జంపన్నవాగు
ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/వాజేడు: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మండల పరిధిలోని మల్యాల, కొండాయి, గోవిందరాజులకాలనీ, ఐలాపురం గ్రామాలకు రాకపోకలు చిలిపోయాయి. వాగు వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాగు ఉధృతి పెరిగినప్పుడు రాకపోకలను నిలిపివేస్తున్న పరిస్థితి. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవలను సైతం వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పక్కన పెడుతున్నారు. అలాగే మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి గ్రామానికి సైతం రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవతలి గ్రామాల ప్రజలు వాగు వరద తగ్గితేగాని బయటకు వచ్చే పరిస్థితి లేదు. వెంకటాపురం(కె) మండల పరిధిలోని కలిపాక వాగు ఉధృతంగా ప్రమాధ స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు గిరిజన గ్రామాలైన కలిపాక, ముత్తారం, పెంకవాగు, సీతరాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తగ్గుతున్న గోదావరి వరద
రెండు రోజుల క్రితం నుంచి ఉగ్రరూపం దాల్చిన గోదావరి తగ్గుముఖం పట్టింది. రామన్నగూడెం వద్ద ఆదివారం 15.50మీటర్లు ఉండగా సోమవారం 13.91కు తగ్గింది. క్రమ క్రమంగా గోదావరి వరద తగ్గుతుండడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా వాజేడు మండల పరిధిలోని నీటిలో మునిగి ఉన్న రహదారులు క్రమంగా బయటపడ్డాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు కొనసాగుతున్నాయి. టేకులగూడెం గ్రామ చివరన మర్రిమాగు వద్ద జాతీయ రహదారి నుంచి వరద నీరు తగ్గడంతో రెండు రాష్ట్రాల మధ్యన రాకపోకలు కొనసాగుతున్నాయి.
భారీ వర్షం.. లోతట్టు ప్రాంతం జలమయం
మంగపేట: మండల పరిధిలోని రమణక్కపేట అటవి ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో లోతట్టు ప్రాంతం పూర్తిగా జలమయమైంది. సుమారు మూడు గంటల పాటు కుండపోతగా వర్షం పడడంతో గండొర్రెగుట్ట నుంచి వచ్చిన వరద నీటితో పాటు మల్లూరు వాగు మధ్యతరహ ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా వచ్చిన భారీ వరద తోడు కావడంతో గండిపడిన చోటు నుంచి గ్రామంలోని సీఎస్‌ఐ స్కూల్, అంబేడ్కర్ కాలనీ మీదుగా వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఉదయం 7 గంటల వరకు వరదనీరు ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు పైనుంచి ప్రవహించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వర్షం తగ్గిపోవడంతో పాటు వరదనీరు పూర్తిగా తొలగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
పలు గ్రామాలకు రాకపోకలు బంద్
తగ్గుముఖం పట్టిన గోదావరి

ఉధృతంగా జంపన్నవాగు

ఉధృతంగా జంపన్నవాగు