ములుగు: జిల్లా విద్యాశాఖ అధికారిగా సోమవారం సిద్ధార్థరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ములుగు ఇండస్ట్రీస్ మేనేజర్‌గా కొనసాగుతున్న సిద్ధార్థరెడ్డికి ఇన్‌చార్జ్ డీఈఓగా అదనపు బాధ్యతలను కలెక్టర్ దివాకర అప్పగించారు. గత జూన్ 16న డీఈఓ పాణిని లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో సస్పెండ్ అయ్యాడు. హనుమకొండ డీఈఓ వాసంతికి జూన్ 17న జిల్లా డీఈఓగా అదనపు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆమె విధుల్లో చేరలేదు. దీంతో కలెక్టర్ చొరవ తీసుకుని ఇంటర్ విద్యాశాఖ అధికారి చంద్రకళకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు బాధ్యతలు నిర్వర్తించడం ఆమెకు ఇబ్బందిగా మారడంతో సోమవారం సిద్ధార్థరెడ్డికి ఇన్‌చార్జ్ డీఈఓగా బాధ్యతలు అప్పగించారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దు, హింసామార్గం విడిచి సాధారణ ప్రజా జీవితంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం కరపత్రాలు వెలిశాయి. మండల పరిధిలోని బయ్యక్కపేట, ఊరట్టం, కాల్వపల్లి గ్రామాల్లో పలుచోట్ల కరపత్రాలు కనిపించాయి. మావోయిస్టులతో ఒరిగేదేమి లేదని అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మావోయిస్టుల అవసరం లేదని.. గ్రామాల అభివృద్ధికి, పిల్లల భ విష్యత్ బాగుండాలంటే మావోయిస్టుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయం ఆయా గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.
ములుగు రూరల్: యాసంగిలో రైతులు పండించిన సన్నధాన్యానికి బోనస్ డబ్బులు చెల్లించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్‌పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందించి మాట్లాడారు. బోనస్ డబ్బులు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలకు సకాలంలో యూరియా అందించాలన్నారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని దుయ్యబట్టారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర దక్కేలా చట్టం చేయాలని కోరారు.
ములుగు రూరల్: ఆశ కార్యకర్తలకు అందిస్తున్న వేతనాలను తగ్గిస్తామని ఆరోగ్యశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని ఫిక్స్‌డ్ వేతనాల జీఓను విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టగా అడ్డుకుని అరెస్టులు చేయడం సరికాదన్నారు.అరెస్టు అయిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, మంజుల, సరిత, రజిత, యశోద, శ్రావ్య, మాధవి, శోభ, స్వరూప పాల్గొన్నారు.
ములుగు: గంజాయి సేవిస్తున్న 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం ములుగు మండలం ఇంచర్ల సమీపంలో కిలోన్నర గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ములుగు పోలీసులు పట్టుకొని విచారించినట్లు తెలిసింది. దీంతో వెంకటాపురం(ఎం) మండల కేంద్రానికి చెందిన నలుగురు, ములుగుకు చెందిన ఇద్దరు, ఇంచర్లకు చెందిన మరో యు వకుడికి సుమారు 500 గ్రాముల గంజాయిని విక్రయించానని పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి మిగతా ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఇన్‌చార్జ్ డీఈఓగా సిద్ధార్థరెడ్డి బాధ్యతలు