
దోబూచులాడుతున్న గోదావరి..!
● ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలు
● తగ్గుతూ.. పెరుగుతున్న వరద
● సమ్మక్క సాగర్‌బ్యారేజీ వద్ద 8,53,023 క్యూసెక్కులు
కన్నాయిగూడెం: గోదావరి ఉధృతి తగ్గుతూ పెరుగుతూ.. దోబుచులాడుతోంది. వారం రోజులుగా మండలంతోపాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా నీరు చేరుతోంది. దీంతోపాటు ఎగువన ఉన్న సరస్వతి, లక్ష్మి, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వరద నీటితో ఉరకలేస్తుంది. నిన్నటి వరకు పెరుగుతూ వచ్చిన గోదావరి శనివారం ఉదయం తగ్గి సాయంత్రం కొంతమేర పెరిగింది. ఉదయం బ్యారేజీలోకి ఎగువ ప్రాంతం నుంచి 8,57,190 క్యూసెక్కులు చేరగా.. మధ్యాహ్నం 8,45,043 క్యూసెక్కులు చేరింది. సాయంత్రం 8,53,023 క్యూసెక్కులు ఉంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 83.30 మీటర్లుగా కొనసాగుతుంది.
జలదిగ్బంధంలో రహదారులు
వాజేడు: శనివారం ఉదయం తగ్గిన గోదావరి వరద సాయంత్రం నుంచి మళ్లీ పెరుగుతుంది. శుక్రవారం రాత్రి 16.740 మీటర్లకు పెరిగిన గోదావరి శనివారం మధ్యాహ్నం వరకు 16.720 మీటర్లకు తగ్గింది. సాయంత్రానికి మండల పరిధిలోని పేరూరు వద్ద 16.760 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరద ఉధృతంగా పెరుగుతుండడంలో మండలంలోని రహదారులు పలు చోట్ల జలదిగ్బంధంలో ఉన్నాయి. టేకులగూడెం చివరన 163 నంబర్ జాతీయ రహదారి ముంపునకు గురైన విషయం తెలిసిందే. వరద తీవ్రత పెరగడంతో రెండు రాష్ట్రాల మధ్యరాక పోకలు నిలిచిపోయాయి. ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం, జాతీయ రహదారి నుంచి కోయవీరాపురం, వాజేడు–గుమ్మడి దొడ్డి గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల్లో గోదావరి వరదతో పొలాలు నీట మునిగాయి. రహదారులు నీట మునగడంతో అప్రమత్తమైన అధికారులు పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. ప్రజలు వరదలోకి వెళ్లకుండా ట్రాక్టర్లను అడ్డంగా పెట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

దోబూచులాడుతున్న గోదావరి..!