
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
వాజేడు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని పైలట్ గ్రామ పంచాయతీ టేకులగూడెంలో మంగళవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. బిల్లులు ఖాతాల్లో పడుతున్నాయని అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇళ్ల నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఇల్లు రాని వారు ఆందోళన చెందవద్దని అర్హులందరికీ ఇళ్లు మంజూరు అవుతాయని వివరించారు. అలాగే మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులతో మాట్లాడిన ఆయన మధ్యాహ్న భోజనంతో పాటు వంటగదిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిధిలోని పేరూరు పీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగీ వ్యాధుల నియంత్రణలో వైద్యాధికారులు నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో తయారు చేసిన ప్రణాళికల షెడ్యూల్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తప్పని సరిగా అమలు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో అమలు తీరును సూపర్‌వైజర్లు పర్యవేక్షించాలన్నారు. ఆశ కార్య కర్తలు ప్రతీరోజు 20 ఇళ్లను సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారికి మందులను ఇవ్వాలన్నారు. జ్వరం తగ్గకపోతే పీహెచ్‌సీలకు తీసుకురావాలని సూచించారు. అనంతరం ల్యాబ్, మందుల గది, ఇన్‌పేషెంట్ వార్డులను సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. పేరూరు వైద్యశాలకు మరో మేడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్‌చార్జ్ ఎంపీవో శ్రీకాంత్ నాయుడు, ఎంఈఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర

ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి