
యూరియా కోసం.. అరిగోస
వెంకటాపురం(ఎం): పగలనకా.. రాత్రనకా.. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆపై రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. పలు చోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను సముదాయిస్తున్నారు. పోలీసులే రైతులకు యూరియా టోకెన్లు అందిస్తూ దగ్గరుండి అధికారులచే యూరియా పంపిణీ చేయిస్తున్నారు. అయినప్పటికీ యూరియా కోసం రైతుల ఆందోళనలు ఆగడం లేదు. కష్టాలు తీరడం లేదు. వ్యవసాయ పనులు మానుకొని సహకార సంఘాల వద్ద క్యూలు కడుతున్నారు. మంగళవారం వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో అర్ధరాత్రి 2 గంటల నుంచి, వెంకటాపురం మండల కేంద్రంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే రైతులు పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట క్యూ కట్టారు. అర్ధరాత్రి నుంచి క్యూలో నిలబడిన ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున ఇచ్చి పంపుతున్నా చివరి వరుసలో ఉన్న రైతులకు అందలేదు. దీంతో పంటలను ఎలా సాగుచేయాలని, యూరియా కొరతతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
అప్పడు లేని కొరత.. ఇప్పుడెందుకు?
గతంలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎలా ఎదురైందని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో వరిపంట 1,30,117 ఎకరాల్లో, పత్తి 27,143, మొక్కజొన్న 8,365 ఎకరాలు, మిర్చి 6,900 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో 1,70,169 ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా, 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 11 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంపిణీ చేసినప్పటికీ యూరియా కొరత ఉండడంతో ప్రశ్నార్థకంగా మారింది. యూరియాను రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం మూలంగానే సన్న, చిన్న కారు రైతులకు యూరియా దొరకకుండా ఇబ్బందులు పడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
పోలీసుల పహారాలో రైతులకు పంపిణీ
పనులు మానుకుని
క్యూలో ఉంటున్న అన్నదాతలు