
సమస్యల పరిష్కారానికి కృషి
ఏటూరునాగారం: ఏజెన్సీ గ్రామాలలో నెలకొన్న దళిత, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిచేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని ఏర్పా టు చేశారు. ఈ సమావేశానికి ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల నుంచి దళిత గిరిజన సంఘాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. ముందుగా ఐటీడీఏలో ఆయా శాఖల వారీగా అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాలో 1/70 యాక్ట్ ఉన్నప్పటికీ హక్కులను ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. ఐటీడీఏ ద్వారా ప్రత్యేక డీఎస్సీ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ ఏజెన్సీలో జీవో నంబర్ 3 రద్దయిందని దాని అమలుకు కృషి చేస్తానని తెలిపారు.
6న కలెక్టర్‌రేట్‌లో సమావేశం
ఈ నెల 6న కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించాలన్నారు. దళిత గిరిజన సంఘాల నాయకులు కూడా పాల్గొనాలన్నారు. అధికారులందరూ ఒకేచోట ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు.
వనదేతల దర్శనం..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం వనదేవతలను వెంకటయ్య దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు నీలాదేవి, రాంబాబునాయక్, శంకర్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్‌లతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య