
లింగనిర్ధారణ పరీక్షలు నేరం
ములుగు రూరల్: లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని రాయినిగూడెం పీహెచ్‌సీ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ పిల్లలను రక్షించాలి– ఆడ పిల్లలను చదివించాలి అనే నినాదంతో గ్రామాల్లో విస్తృతంగా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, శిశు సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి జిల్లా కోఆర్డినేటర్ రమాదేవి, వైద్యులు ప్రసాద్, నాగఅన్వేష్, డోమో సంపత్, సఖి సెంటర్ అడ్మిన్ లావణ్య, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా రాయినిగూడెం పీహెచ్‌సీలో అశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నియంత్రణలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు సమన్వయంతో పనిచేసి క్షయ రహిత సమాజాన్ని నిర్మించాలని సూచించారు.
ములుగు: రేపు(గురువారం) జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రం వద్ద ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష, అలింకో వారి సౌజన్యంతో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ అవకాశాన్ని దివ్యాంగుల పిల్ల ల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరానికి చిన్నారులను తీసుకొచ్చే తల్లిదండ్రులు రెండు పాస్‌ఫొటోలు, 40 శాతం కంటే ఎక్కువగా దివ్యాంగత్వం ఉన్నట్లు సదరం ధృవపత్రం, ఆదాయం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచించారు.
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో మంగళవారం బాండ్ మొక్కజొన్న డీలర్లతో ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా మొక్కజొన్న విత్తనాలు ఉత్పత్తి చేసి ఇబ్బందులకు గురికావద్దని తెలిపారు. భవిష్యత్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విత్తనోత్పత్తి చేయదలిచిన రైతులు తప్పనిసరిగా ఆర్గనైజర్, కంపెనీ డీలర్ల నుంచి అగ్రిమెంట్ తీసుకోవాలని సూచించారు. రైతులు పాటించాల్సిన పద్ధతులు, దిగుబడిలో వచ్చే వ్యత్యాసం లాంటి వివరాలను అగ్రిమెంట్‌లో పొందు పరచాలన్నారు.

లింగనిర్ధారణ పరీక్షలు నేరం