
గ్రామాల అభివృద్ధే ధ్యేయం
ములుగు రూరల్/వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట/తాడ్వాయి: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. జిల్లాలోని ములు గు, వెంకటాపురం (ఎం), గోవిందరావుపేట, తా డ్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ములుగు మండలంలోని జగ్గన్నపేట, ఇంచర్ల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి ప్రారంభించారు. జగ్గన్నపేట గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.35లక్షలు, 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజ చేశారు. ఇంచర్లలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్లతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీపీఓ దేవరాజ్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం) మండలంలోని జవహర్‌నగర్‌లో రూ.12లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. గోవిందరావుపేట మండలంలోని చల్వాయిలో రూ.45లక్షలు, దుంపిల్ల గూడెంలో రూ.10లక్షలు, పస్రాలో రూ.75 లక్షలతో సీసీ రోడ్డు పనులకు కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్‌తో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల కేంద్రంలోని కామారంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనం, సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు.
మంత్రి సీతక్క