
అభ్యంతరాలు తెలియజేయాలి
ములుగు రూరల్: ఆగస్టు 30వ తేదీ లోపు డ్రాఫ్ట్ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలియజేయాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేశామని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్‌డేట్ చేశామన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురిస్తామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు జాబితా పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 31వ తేదీ లోపు ఫిర్యాదు చేయాలన్నారు. సెప్టెంబర్ 2న తుది జాబితా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, పలు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపద్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ దివాకర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం(కె), ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, ఉధృతి పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. అధికార యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. ఏదైన తక్షణసహాయం కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004257109కు సమాచారం అందించాలన్నారు.
కలెక్టర్ టీఎస్ దివాకర