
మట్టి విగ్రహాలను పూజించడం మేలు
ములుగు రూరల్: వినాయక చవితి వేడుకల్లో మట్టి విగ్రహాలను పూజించడం మేలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో మట్టి విగ్రహాల పోస్టర్‌ను ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. వినాయక విగ్రహాల తయారీలో వినియోగించే రసాయనాలతో జలవనరులు కాలుష్యంగా మారి జలరాశులు అంతరించి పోతున్నాయన్నారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. చెరువుల్లో మట్టి మేటలను తొలగించడానికి, చెరువుల స్వచ్ఛతను కాపాడడానికి భక్తులు నడుంబిగించాలని తెలిపారు. మట్టి విగ్రహాలతో చెరువులు కలుషితం కాకుండా ఉంటాయని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ సుభాష్‌నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర