
కోతకు గురవుతున్న కరకట్ట
కానరాని జియోట్యూబ్స్
ఏటూరునాగారం: ఇటీవల కురిసిన వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కరకట్ట ఉంటుందా... కొట్టుకపోతుందా అనే ప్రమాదస్థాయికి చేరింది. మండల పరిధిలోని రామన్నగూడెం పుష్కరఘాట్ నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న కరకట్ట మట్టి ఇటీవల వరదలకు ఒర్లిపోయి పగుళ్లు తేలింది. కరకట్ట మట్టి కొట్టుకుపోవద్దని ఇరిగేషన్ అధికారులు టెక్స్‌టైల్ క్లాత్ వేసినప్పటికీ ఎలాంటి ఫలితాలను ఇవ్వడం లేదు.
నిర్లక్ష్యం వీడకుంటే.. భారీ మూల్యం తప్పదు
గోదావరి కరకట్ట పటిష్టపర్చడంలో అధికారులు, పాలకులు పట్టించుకోకపోతే వరద ఉధృతికి కరకట్ట కోతకు గురై గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. పన్నెండేళ్ల నుంచి కరకట్ట పటిష్ట పర్చడానికి గత, ప్రస్తుత ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కబెడుతున్నాయి. కరకట్ట పటిష్టపర్చడానికి గత ప్రభుత్వ హయాంలో రూ.137 కోట్ల బడ్జెట్ ఇస్తున్నట్లు 2022లో ఏటూరునాగారం వచ్చిన సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఒక్కపైసా కూడా రాలేదు. ప్రస్తుత ప్రభుత్వం నేటికి ఎలాంటి నిధులను కేటాయించడం లేదు. కేవలం మరమ్మతులతోనే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. ఇరిగేషన్ అధికారులు కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి మరమ్మతులకు మాత్రమే మొగ్గుచూపుతున్నారు.
వరదలు వచ్చినప్పుడే హడావుడి
గోదావరి వరద వచ్చినప్పుడే అధికారులు, పాలకుల హడావుడి చేస్తున్నారనే తప్ప వేరేలేదు. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించినట్లు హడావుడి చేసి లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం ప్రభుత్వ అధికారులకు షరామాములే. ఇలాంటి సంఘటనలు గత ఐదేళ్ల నుంచి జరుగున్నా అధికారులు శాశ్వత పరిష్కారంపై మొగ్గు చూపడం లేదు. వాహనాల డీజిల్, భోజనాలు, ఇతర బ్లీచింగ్ పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం తప్పా ఒరిగింది ఏమి లేదని ముంపు ప్రాంతాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు చోట్ల కోతలు..
కరకట్ట మొత్తం 10.2 కిలోమీటర్లు రామన్నగూడెం–పుష్కరఘాట్ నుంచి ఏటూరునాగారం– ఎక్కెల గ్రామం వరకు ఉంది. ఇందులో 3.5, 5.8, 6.9 కిలో మీటర్ల వద్ద కరకట్ట ఆయా ప్రాంతాల్లో కోతలకు గురవుతోంది. ప్రస్తుతం 300మీటర్ల వద్ద నూతనంగా మట్టి ఒర్లిపోతోంది.
గోదావరి వరదకు కరకట్ట కొట్టుకుపోకుండా ఉండేందుకు జియోట్యూబ్స్ టెక్నాలజీతో నిర్మిస్తామని గతేడాది ప్రభుత్వం హడావుడి చేసింది. కాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగానే మారింది. వాటి కోసం రూ.70 లక్షల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించనప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. జియోట్యూబ్స్ పనులు మొదలు పెడుతారనే నమ్మకాలు సైతం లేవని ప్రజలు వాపోతున్నారు.
గోదావరి ఉధృతికి ఒర్లిపోతున్న మట్టి
అధికారుల నిర్లక్ష్యం..
కానరాని జియోట్యూబ్స్