
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ములుగు రూరల్/వెంకటాపురం(ఎం): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మల్లంపల్లి, జాకారం, బండారుపల్లి, శ్రీనగర్, మహ్మద్‌గౌస్ పల్లి గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు, కూరగాయల మార్కెట్, ఇంటర్నల్ సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు శనివారం కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణితో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం నూతన మిని బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో అంతర్గత రహదారులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రహదారి విస్తరణ పనులు సైతం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీ రాజ్ ఈఈ అజయ్ పాల్గొన్నారు.
రూ.32.41 కోట్లు.. 689 పనులు ప్రారంభం
ఉపాధి పనుల జాతరలో భాగంగా జిల్లాలో రూ.32.41 కోట్లతో 689 పనులు ప్రారంభించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పలు గ్రామాలలో వివిధ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా కింద మహిళలకు మంజూరైన పశువుల, మేకల షెడ్, కోళ్లపారం, స్వచ్ఛభారత్ మిషన్ కింద సైడ్ కాల్వలు, డ్రెయినేజీ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారని వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క