
జయశంకర్ సేవలు మరువలేనివి
ములుగు రూరల్: తెలంగాణరాష్ట్ర సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వరాష్ట్ర ఏర్పాటుకు చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సార్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జయశంకర్ సార్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొని ఉద్యమానికి మార్గదర్శకుడిగా నిలిచారని వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజ్, డీపీఆర్‌వో రఫిక్, కలక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా జెడ్పీ కార్యాలయంలో జయశంకర్‌సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంపత్‌రావు సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అర్హులందరికీ పింఛన్లు
ప్రతినెలా అర్హులందరికీ పింఛన్లు అందేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకం అమలుపై ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్, పంచాయతీ కార్యదర్శులకు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ డిపార్ట్‌మెంట్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పింఛన్ అర్హత ఉన్న వారికి ప్రతినెలా అందేలా కృషి చేయాలన్నారు. అనర్హులను గుర్తించి తొలగించాలని సూచించారు. ముఖచిత్రం ద్వారా పింఛన్ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. టీజీ సెర్ప్ పెన్షన్ డైరెక్టర్ గోపాల్‌రావు, అదనపు కలెక్టర్ సంపత్‌రావు చేయూత పెన్షన్‌పై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవ్‌రాజ్, అదనపు డీఆర్‌డీఓ గొట్టె శ్రీనివాస్, ములుగు మున్సిపల్ కమిషనర్ సంపత్, టీజీ ఆన్‌లైన్ ప్రతినిధి రాజు అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును గమనించారు. ప్రతీ విద్యార్థి లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఉపాధ్యాయులకు, నిర్వాహకులను ఆదేశించారు. భోజనం మంచిగా ఉంటుందా లేదా అని విద్యార్థులను కలెక్టర్ ప్రశ్నించగా బాగానే ఉంటుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ కమిటీ చాలా కీలక పాత్ర పోషించాలని, తప్పనిసరిగా కమిటీ సభ్యులు భోజనం తిని మంచిగా ఉందని నిర్ధారణ చేసిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలని సూచించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర