
భద్రకాళికి ఆలయంలో పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, కన్‌స్ట్రక్షన్ రైల్వే సేఫ్టీ ప్రాజెక్ట్‌స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఏకే సిన్హా దంపతులు, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ డి.సుబ్రమణియన్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈఓ శేషుభారతి వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాలయ ప్రాంగణంలో ఈఓ శేషుభారతి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ధర్మకర్తలు నార్ల సుగుణ, జారతి వెంకటేశ్వర్లు, తొగరు క్రాంతి, దేవాలయ సిబ్బంది హరినాఽథ్, కృష్ణ, నవీన్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.