
మీ సేవ.. మరింత చేరువ..
వెంకటాపురం(ఎం): కాగిత రహిత పాలనకు సేవలందిస్తున్న మీసేవ మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మీసేవ ద్వారా ఇప్పటికే పలు రకాల ప్రయోజనాలు అందుతుండగా మరో 9 రకాల సేవలను మీసేవలో పొందుపరిచారు. ప్రస్తుతం మీసేవ కేంద్రాలు రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయితీరాజ్ శాఖల సేవలందిస్తూ పలు ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తుంది. ఇటీవల రెవెన్యూశాఖ నుంచి ఆరు రకాల సర్వీసులు, అటవీశాఖ నుంచి రెండు సర్వీసులు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్పేర్, సీనియర్ సిటిజన్ నుంచి ఒక సర్వీసును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రెవెన్యూ శాఖ నుంచి స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, నేమ్ చేంజ్ ఆఫ్ సిటిజన్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్, మైనారిటీ ధ్రువీకరణ, సర్టిఫికెట్ పునజారీ(కులం, ఆదాయం), క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, అటవీశాఖ నుంచి వన్యప్రాణులతో చంపబడిన మానవ/పశువులకు పరిహారం దరఖాస్తులు, సమ్మిల్/టింబర్ డిపో ఫ్రెష్, రెన్యువల్‌కు సంబంధించిన దరఖాస్తులు, డబ్లుసీడీ, సీఎస్ నుంచి సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ మానిటరింగ్ సిస్టం దరఖాస్తులు మీసేవలోకి నూతనంగా అందుబాటులోకి వచ్చాయి. అప్లికేషన్ కాగితాలతో ఇకపై కార్యాలయాలకు వెళ్లకుండా మీసేవలోనే దరఖాస్తు చేసి మీసేవ ద్వారానే నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
త్వరలో మరిన్సి కొత్త సర్వీస్‌లు..
కులం అనేది ఎప్పటికీ మారదు కాబట్టి ఒకసారి తహసీల్దార్ కులం నిర్ధారణ సర్టిఫికెట్ మంజూరుచేస్తే దాని ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నిసార్లు అయిన దరఖాస్తుదారుడు కుల ధృవీకరణ పత్రాన్ని రెండు నిమిషాలలో పొందే అవకాశాన్ని మీసేవలో నూతనంగా కల్పించనున్నారు. హిందూ మ్యారేజ్ సర్టిఫికెట్, నాన్ అగ్రికల్చర్ మార్కెట్ వాల్యు సర్టిఫికెట్, పాన్ కార్డ్‌లో చేర్పులు మార్పులు, ఇసుక బుకింగ్ సేవలు మీసేవలో అందుబాటులోకి రానున్నాయి.
కొత్తగా మరో 9 రకాల సేవలు
కాగిత రహిత పాలనకు ప్రభుత్వం కృషి
ప్రజలకు మెరుగైన సేవలు..
జిల్లాలోని 54 మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. 2011లో 10 రకాల సేవలతో ప్రారంభమైన ఈ కేంద్రాలు ప్రస్తుతం 350 రకాల సేవలందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో 9 రకాల సేవలు అందుబాటులోకి రాగా మరో ఐదు రకాల సేవలను మీసేవలో పొందుపరిచారు. మీ సేవ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– దేవేందర్, ఈ–డిస్ట్రిక్ మేనేజర్, ములుగు

మీ సేవ.. మరింత చేరువ..

మీ సేవ.. మరింత చేరువ..