
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
ములుగు రూరల్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్–01, భౌతికశాస్త్రం–01 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని సూచించారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. డిగ్రీ స్థాయిలో బోధన అనుభవం కలిగి ఉండాలని అన్నారు. ఈ నెల 23న కళాశాలలో బయోడేటా సమర్పించి డెమో, ఇంటర్వ్యూ, విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి
మలుగు రూరల్ : ఈ నెల 23న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యాసంస్థల బంద్‌ను చేపట్టినట్లు తెలిపారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు భరత్, సాయి పాల్గొన్నారు.
వాహనాల తనిఖీ
వెంకటాపురం(కె) : మండల పరిధిలోని బోదాపురం గ్రామశివారులో ఆదివారం ఎస్సై కొప్పుల తిరుపతిరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. మండల కేంద్రానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి వచ్చి వెళ్లే వాహనాలు, వాజేడు మండలం నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా తారస పడితే వారి నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి పంపిస్తున్నారు. తనిఖీల్లో పీఎస్సై సాయికృష్ణ, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.
సూరవీడులో
బోనాల వేడుకలు ..
వెంకటాపురం(కె) : మండల పరిధిలోని సూరవీడు గ్రామంలో ఆషాఢమాసంలో భాగంగా ఆదివారం బోనాల వేడుకలు గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు ఉదయం నుంచే ఉపావాసం ఉండి గ్రామదేవతలకు బోనాలు వండుకొని మేళతాళాలు, డప్పువాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ముత్యాలమ్మ తల్లికి బోనాలను సమర్పించి తమ మొక్కులను సమర్పించుకున్నారు. గ్రామంలో పాడి పంటలు బాగుండాలని గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పిల్లల జయసింహా, పిల్లల లీలారాణి, కిరణ్, ఈశ్వర్ తదితరులు ఉన్నారు.
23 నుంచి కేయూ ఎంబీఏ
రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసింఇక్బాల్ తెలిపారు. ఈనెల 23, 25, 28, 30, ఆగస్టు ఒకటి, నాలుగో తేదీల్లో పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
25న మంద కృష్ణమాదిగ రాక
చిట్యాల: దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈనెల 25న జిల్లాకేంద్రంలో జరిగే సమావేశానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ రానున్నట్లు ఎమ్మార్పీస్ జిల్లా ఇన్‌చార్జ్ రుద్రారం రామచంద్ర మాదిగ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం