
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
వెంకటాపురం(కె): అడవులను సంరక్షించడం అందరి బాధ్యత అని సీసీఎఫ్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలో ని తిప్పాపురం, ఆలుబాక అటవీ భూములను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో వెంకటాపురం, వాజేడు మండలాల అటవీశాఖ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. వన మహోత్సవంలో భాగంగా కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్‌డీఓ ద్వాలియా, సెక్షన్ అఫీసర్ దేవయ్య, అటవీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
గోదాం తనిఖీ
వెంకటాపురం(కె): మండ కేంద్రంలోని జీసీసీ గోదాంను శుక్రవారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఇటీవల జీసీసీ గోదాంలో 243 క్వింటాల బియ్యం మాయంపై ములుగు సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీ చేసి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. ఈ మేరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గోదాంలో నిల్వ ఉన్న స్టాక్‌ను పరిశీలించి ఎన్ని క్వింటాల బియ్యం మాయమయ్యాయి.. ఎలా జరిగిందనే అంశాలపై విచారణ చేశారు. ఇదిలా ఉండగా.. వివరాలు వెల్లడించేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిరాకరించడం గమనార్హం.
28న అరుణాచలం
బస్సు సర్వీస్ ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 28న అరుణాచలం, ఇతర తీర్థయాత్రల ఆర్టీసీ బస్సు సర్వీస్ భూపాలపల్లి డిపో నుంచి బయలుదేరి వెళ్లనున్నట్లు ఆర్టీసీ డీఎం ఇందు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కాంచీపురం, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రత్యేక బస్సు నడిపించనున్నట్లు తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధర ఒక్కరికి రూ.5,300 ఉంటుందని తెలిపారు. సీటు బుకింగ్ కోసం 97019 67519, 88017 78959 నంబర్లకు ఫోన్‌చేయాలని సూచించారు. ఆగస్టు నెలలో వారానికి ఒకటి చొప్పున టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా విజయవాడ, అన్నవరం, భద్రాచలం, పంచారామాలు, షిరిడీ వంటి ప్రముఖ యాత్ర స్థలాలు ఉంటాయన్నారు. 30మంది ప్రయాణికులు ఉన్నట్లయితే వారికోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేటి నుంచి తపాలా
సేవలు బంద్
ఖిలా వరంగల్: ఈనెల 22 నుంచి తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా నూతన సాఫ్ట్‌వేర్ అమలు చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తపాలా శాఖ సేవలు నిలిపివేయనున్నట్లు వరంగల్ డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరవుతారని, సేవలు మాత్రం కొనసాగవని చెప్పారు. వినియోగదారులు, ఖాతాదారులు ఈవిషయం గమనించి సహకరించాలని ఆయన కోరారు.
ప్రీ పీహెచ్‌డీ పరీక్ష ఫీజు చెల్లించాలి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యూకేషన్, లా, ఫార్మాస్యూటికల్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగాల పరిశోధకులు ప్రీ పీహెచ్‌డీ పరీక్ష ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ను శుక్రవారం పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సౌజన్య జారీ చేశారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 30వ తేదీ వరకు, రూ.250 అపరాధ రుసుంతో ఆగస్టు 7వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఫీజు రూ.930 చెల్లించాల్సింటుందని తెలిపారు.

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

అడవుల సంరక్షణ అందరి బాధ్యత