
నిరుపయోగంగా బ్యాటరీ వెహికిల్స్
వెంకటాపురం(ఎం): యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ప్రతిరోజు పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నా దివ్యాంగులు, వృద్ధులకు తిప్పలు తప్పడం లేదు. శని, ఆదివారం భక్తులు, విద్యార్థులు, పర్యాటకులు వేలాది సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. రామప్ప ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు వీల్‌చైర్లు లేకపోవడంతో ఆలయ ప్రధాన గేటునుంచి రామప్ప ఆలయం వద్దకు నడిచి వెళ్లడానికి, ఆలయ మెట్టు ఎక్కే సమయంలో నానా తంటాలు పడుతున్నారు. రామప్పలో బ్యాటరీ వెహికిల్స్ రెండు ఉన్నప్పటికీ వాటిని వీఐపీలు వచ్చినపుడే వినియోగిస్తూ తర్వాత మూలన పడేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన గోలి సావిత్రి అనే దివ్యాంగురాలు రామప్ప సందర్శనకు వచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురైంది. దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్న విలేకరులకు తమ గోడును వెల్లబోసుకుంది. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వీఐపీలు వచ్చినప్పుడే కాకుండా వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించి, వారికి ప్రత్యేక దర్శనం కల్పించాలని సావిత్రితోపాటు పలువురు పర్యాటకులు కోరుతున్నారు.
రామప్పకు వీఐపీలు వచ్చినప్పుడే వినియోగం
దివ్యాంగులు, వృద్ధులకు తప్పని తిప్పలు

నిరుపయోగంగా బ్యాటరీ వెహికిల్స్