
ప్రభుత్వాలు జీఓ 49 రద్దు చేయాలి
కన్నాయిగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జీఓ 49 రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధికార ప్రతినిధి పొడెం బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గుండ్ల పాపారావు అధ్యక్షతన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆదివాసీల అత్యవసర సమావేశంలో పొడెం బాబు మాట్లాడారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న జీఓ నంబర్ 49 రద్దు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తూ అటవీ సంపదను దోచుకుపోవడానికి చూస్తున్నాయని ఆరోపించారు. ఈ జీఓతో ఆది వాసీలకు అన్యాయం జరుగుతుందని, ఆదిలాబాద్ , జగిత్యాల, పెద్దపల్లి, అసీఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెంతోపాటు మరో కొన్ని ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించొద్దంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి నిలిపివేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మురళి, ఆలం రాంబాబు, సంపత్, పొడెం శోభన్, ఆలం కుమార్, బొగ్గం బాబు పాల్గొన్నారు.
తుడుందెబ్బ రాష్ట్ర అధికారప్రతినిధి బాబు