ఆ తర్వాతే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ఆ తర్వాతే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు

Jul 17 2025 8:48 AM | Updated on Jul 17 2025 8:48 AM

ఆ తర్వాతే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు

ఆ తర్వాతే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోందా? బుధవారం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించడం వెనుక మతలబు ఇదేనా? స్థానిక సంస్థల నేపథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచిందా?.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. అధికారవర్గాలు కూడా స్థానిక సంస్థల నోటీఫికేషన్‌ త్వరలోనే రావచ్చని చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ స్థానాలను ప్రకటించినట్లు భావిస్తున్నారు.

‘స్థానిక’ పోరుకు సర్కారు సమాయత్తం

ఉమ్మడి వరంగల్‌లో స్థానాల ఖరారు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ,

పంచాయతీ స్థానాల వెల్లడి

వచ్చే నెల మొదటి, రెండో వారాల్లో నోటిఫికేషన్‌?

అధికారులకు ఎన్నికల సంఘం

సంకేతాలు.. సిద్ధమవుతున్న పార్టీలు

75 జెడ్పీటీసీలు, 778 ఎంపీటీసీలు..

స్థానిక ఎన్నికల కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ సంతకం చేయడమే తరువాయి రిజర్వేషన్‌లను ప్రకటించనున్నారు. ముందుగా పేర్కొన్న విధంగానే మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాతే గ్రామ పంచాయతీలు, వార్డులకు జరిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు, 75 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ రిజర్వేషన్‌లపైన సందిగ్ధత నెలకొంది.

ఊపందుకున్న ‘స్థానిక’ సందడి... పోటీకి ఆశావహుల సై..

సెప్టెంబర్‌ మాసంలోగా స్థానిక సంస్థల ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో మళ్లీ సందడి జోరందుకుంది. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్‌ కార్డులు, రైతు భరోసా తదితర పథకాల పంపిణీని కాంగ్రెస్‌ పార్టీ వేడుకలా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ప్రయత్నంలో కేడర్‌ను అప్రమత్తం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ సైతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీజేపీ ఈసారి బలప్రదర్శనకు దూకుడు పెంచుతోంది. వామపక్ష పార్టీలు సైతం కార్యక్రమాలను ఉధృతం చేశాయి. కాగా, ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహుల సై అంటున్నారు. ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలుస్తున్నారు. దీంతో వారి ఇళ్ల ముందు సందడి పెరిగింది.

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని భావించిన అధికారులు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులు ఉన్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చినా ఎన్నికలు జరిపే విధంగా 15,021 పోలింగ్‌ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఇటీవలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అందించాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్‌లు సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌లకు వర్తిస్తుంది. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ఆర్డినెన్స్‌ జారీ చేసేందుకు గవర్నర్‌కు పంపగా, ఆయన సంతకం కాగానే ఈ స్థానాలకు రిజర్వేషన్‌ ఖరారు చేయనున్నారు. ఇందుకు మరో వారం, పది రోజులు పట్టినా.. వచ్చే నెల మొదటి, రెండో వారాల్లో నోటిఫికేషన్‌ రావచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు సంకేతాలు అందినట్లు కూడా చెప్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌లో జెడ్పీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వివరాలు

జిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్‌ వార్డులు

హనుమకొండ 1 12 12 129 210 1,986

వరంగల్‌ 1 11 11 130 317 2,754

భూపాలపల్లి 1 12 12 109 248 2,102

మహబూబాబాద్‌ 1 18 18 193 482 4,110

ములుగు 1 10 10 83 171 1,520

జనగామ 1 12 12 134 280 2,534

06 75 75 778 1,708 15,006

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement