
నేడు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
ములుగు రూరల్: జిల్లాలో నేడు(శుక్రవారం) రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు వెంకటాపురం(ఎం) మండలంలోని జవహర్‌నగర్‌లో సీసీ రోడ్డు ప్రారంభం, 9 గంటలకు గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఆయిల్ పామ్ మొదటి సారిగా వచ్చిన పంట కటింగ్, 9.30 గంటలకు సోమళ్లగడ్డ క్రాస్ రోడ్డు పీఎస్‌ఆర్ గార్డెన్ లో రేషన్ కార్డుల పంపిణీ, 10.10 వెంకటాపురం(ఎం) మండలంలోని లక్ష్మీదేవిపేటలో రేషన్‌కార్డుల పంపిణీ, 10.45 గంటలకు బూర్గుపేట మారేడు చెరువు సందర్శన, 11.10 గంటలకు అడవి రంగాపూర్‌లో సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భూపాలపల్లి జిల్లాలో మంత్రి పర్యటన కొనసాగనుంది.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: నిరుద్యోగ యువతీ, యువకులు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని స్టడీ సర్కిల్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ (1,2,3,4) ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్యూట్‌మెంట్ ఫౌండేషన్ కోర్సులలో 150 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ,టీజీబీసీస్టడీసర్కిల్.సీజీజీ. జీఓవీ.ఇన్ ఆన్‌లైన్‌లో ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ మార్కుల ఆధారంగా రిజర్వేషన్ నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. గ్రామీణప్రాంతాల వారికి ఆదాయం రూ.లక్ష మించకూడదని వివరించారు. ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున 5 నెలలు స్టైఫండ్ అందుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు 0870–2571192, 040–2407118 నంబర్‌లలో సంప్రదించాలని సూచించారు.
వారాంతపు సమావేశం
బహిష్కరణ
వాజేడు: మూడు నెలలుగా తమకు వేతనాలను ఇవ్వక పోవడంతో గురువారం నిర్వహించే వారాంతపు సమావేశాన్ని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు బహిష్కరించారు. ఈ మేరకు వాజేడు ఇన్‌చార్జ్ ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడికి వినతి పత్రాన్ని అందజేశారు. వేతనాలు రాకపోవడంతోనే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, పిల్లలు చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మానసికంగా కుంగిపోవడం జరుగుతుందని ప్రభుత్వం వెంటనే తమ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో గౌరిబాబు, విజయ, రమాకుమారి, గాంధీ, రాంబాబు, ఆదినారాయణ, రవికుమార్, రాంబాబు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాలకు విద్యార్థుల ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాలకు ఎంపికయ్యారు. ఈనెల 1నుంచి 8వరకు హైదరాబాద్‌లోని హకీంపేట్ క్రీడాపాఠశాల ఆవరణలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాళేశ్వరం గ్రామానికి చెందిన కోల శాన్వి, గంట హరిచందన, నాగుల తులసి హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచి నాలుగవ తరగతిలో ప్రవేశానికి ఎంపికయ్యారు. శాన్వి, హరిచందన ప్రభుత్వ పాఠశాలో చదువుతుండగా, తులసి ప్రైవేట్ పాఠశాలలో చదువుతుంది. వీరిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
ఎస్పీ, డీఎస్పీ, ఎస్సైపై
ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
కాళేశ్వరం: తనకు తప్పుడు ధ్రువీకరణ నివేదిక ఇవ్వడంతో ఒడిశాలోని ఓ కంపెనీలో ఉద్యోగం రాలేదని మహదేవపూర్ మండలం మద్దులపల్లికి చెందిన చకినారపు రవి ఎస్సీ కమిషన్‌కు ఈనెల 3వ తేదీన ఫిర్యాదు చేశాడు. 15 రోజు ల్లో యాక్షన్ టేకన్ రిపోర్టు (ఏవీఆర్)ను సమర్పించాలని ఎస్సీ కమిషన్ గురువారం ఎస్పీ కిరణ్‌ఖరే, గతంలో కాటారం డీఎస్పీగా పనిచేసిన గడ్డం రామ్మోహన్‌రెడ్డి, కాళేశ్వరం ఎస్సై గన్‌రెడ్డి తమాషారెడ్డిలకు నోటీసులు పంపించింది. ధ్రువీకరణ నివేదిక ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నోటీసులో పేర్కొన్నారు.

నేడు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన