
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక ఉచితం
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుకను అందిస్తుందని కలెక్టర్ టీఎస్.దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులు ఉచిత ఇసుక కోసం పంచాయతీ కార్యదర్శులు ద్వారా ఎంపీడీఓ కార్యాలయంలో బుక్ చేసుకోవాలని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అందించనున్నట్లు వెల్లడించారు. ఇసుక రవాణాకు ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రాక్టర్ల ద్వారా లేదా సొంత ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకోవాలని సూచించారు. ఇతరుల ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.