
స్థానిక రిజర్వేషన్లపై ఉత్కంఠ..
మండలం యూనిట్‌గా రిజర్వేషన్లు
వెంకటాపురం(ఎం): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఇన్నాళ్లుగా రిజర్వేషన్ల ప్రక్రియ ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అది కూడా తొలగిపోనుండడంతో ఎన్నికలు నిర్వహణకు మార్గం సుగుమమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు పెద్దపీట వేస్తుంది. ఈ ఎన్నికల్లోనే. 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. ఈ నెలాఖరు వరకు రిజర్వేషన్లు ఖరారు కానున్నట్టు తెలుస్తోంది. దీంతో బీసీ వర్గాలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రిజర్వేషన్ కేటాయింపు ఇలా..
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లాను యూనిట్‌గా చేసుకుని రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జెడ్పీ చైర్మన్ మాత్రం రా ష్ట్రాన్ని యూనిట్‌గా చేసుకుని రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గత ఎన్నికల్లో పంచాయతీలకు కూడా రాష్ట్రాన్ని యూనిట్‌గా చేసుకుని రిజర్వేషన్లు ఖరారు చేశారు. మండలాన్ని యూనిట్‌గా చేసుకుని సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆయా కులాల జనాభా ఆధారంగా మండల పరిషత్‌కు, తర్వాత సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది.
171 జీపీలు.. 1,520 వార్డు స్థానాలు
జిల్లాలో 9 మండలాలు ఉండగా జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చారు. దీంతో జిల్లాలో మరో నూతనంగా ఏర్పడిన మల్లంపల్లి మండలాన్ని కలుపుకొని తిరిగి 9 ఎంపీపీ, 9 జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో 83 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 35 స్థానాలు బీసీలకు కేటాయించనున్నారు. 9 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 1,520 వార్డు స్థానాలు ఉన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో పాటు మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించనున్నారు.
పాత రిజర్వేషన్లు రద్దు..
గత ప్రభుత్వం వరుసగా రెండు పర్యాయాలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత రిజర్వేషన్లను రద్దు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా గతంలో ఉన్న రిజర్వేషన్లన్నీ మారిపోనున్నాయి. ఆయా గ్రామాల్లో గత సంవత్సరం వచ్చిన రిజర్వేషన్లు ఈ సారి వచ్చే అవకాశం ఉండదు. జిల్లాలో బీసీలకు 42 శాతం, ఎస్టీలకు 7శాతం, ఎస్సీలకు 15 శాతంతో పాటు అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు, వివిధ పార్టీల నాయకులు రిజర్వేషన్ల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుకు ప్రభుత్వం సన్నాహాలు
బీసీలకు 42శాతం కేటాయింపుతో మారనున్న సమీకరణాలు
జిల్లాలో 9 ఎంపీపీ, జెడ్పీటీసీ,
83 ఎంపీటీసీ స్థానాలు