
గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శరత్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఐటీడీఏ నుంచి వీసీలో పీఓ చిత్రామిశ్రా, డీటీడీఓ పోచంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జంజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జేఏఎన్‌ఎంఏఎన్), ధర్తీ ఆభా జంజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్(డీఏ జేయూఏ) పథకం ద్వారా 26 రాష్ట్రాల్లోని 5.5 కోట్ల గిరిజన జనాభాకు రూ.80 వేల కోట్లతో అసాధ్యమైన ప్రాంతాల్లో వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధులతో గిరిజనులకు రోడ్లు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, టెలీకమ్యూనికేషన్, విద్యుత్, గృహ నిర్మాణం వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన గ్రామాల్లోని విద్యార్థులు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామస్తులకు ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. రక్తహీనత, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు అత్యవసర చికిత్సలు అందించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం, వసతి కల్పించాలన్నారు. ఎక్కడైనా ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీసీలో ట్రైబల్ వెల్ఫేర్ ముఖ్యకార్యదర్శి
శరత్