
శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి
● కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్
గోవిందరావుపేట: ఈ నెల 22, 23, 24 తేదీలలో సూర్యపేటలో నిర్వహించే రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ అన్నారు. మండల పరిధిలోని పస్రాలో ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అంబాల మురళి అధ్యక్షతన మంగళవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమాజంలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సామాజిక అంతరాలు, కుల వివక్షత, అంటరానితనం, మూఢనమ్మకాలను నిర్మూలించడం కోసం కేవీపీఎస్ పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సాధించుకున్నామని తెలిపారు. కుల వివక్ష, అంటరానితనంపై నిరంతరం పోరాడుతూ కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు సకాలంలో అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు వసతులు మెరుగు పర్చాలని కోరారు. దళిత బహుజనులందరికీ ఉచిత విద్యుత్ 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ భౌగోళిక అంశాలపైన అవగాహన కల్పించేందుకు కేవీపీఎస్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు సూర్యపేట పట్టణంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం, దేవేందర్, కోటయ్య, జగదీశ్, నరేష్, యాదగిరి, మహేందర్ పాల్గొన్నారు.