
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తీవ్రం
ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు పరిష్కరించకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికుమార్, సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట సోమవారం మహాధర్నా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ముందుగా ఏటూరునాగారం ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. మంత్రి సీతక్క ఉన్న ప్రాంతాల్లో కూడా గిరిజనులపై నిర్బంధాలు ఎక్కువ అయ్యాయన్నారు. ఈ ధర్నాకు రాకుండా ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకోవడం హేమమైన చర్య అన్నారు. ఆదివాసీ గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీ సాగుదారులపై అటవీశాఖ దాడులు ఆపాలని, అర్హులైన ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. జీఓ నంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాడ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అందజేశారు. ఈ దర్నాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్‌కుమార్‌లు బారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొంది రాజేష్, జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి, దామోదర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రవికుమార్, పుల్లయ్య
ఐటీడీఏ ఎదుట మహాధర్నా, పోలీసుల బందోబస్తు