
బీఎల్‌ఓల పాత్ర కీలకం
వాజేడు: ఓటరు నమోదు, తొలగింపు ప్రక్రియలో బీఎల్‌ఓల పాత్ర కీలకమని భద్రాచలం ఆర్డీఓ కె.దామోదర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాల బీఎల్‌ఓలకు గురువారం మాస్టర్ ట్రైనర్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓ దామోదర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారి నుంచి దరఖాస్తులను తీసుకోవడం, ఓటరు లీస్టులోని సవరణలకు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి ప్రక్షాళన చేసే విషయంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. గతంలో నిర్వహించిన ఎన్నికల సమయంలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదని తెలిపారు. ఈ దఫా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. స్థానిక అధికారుల సలహాలు, సూచనలను తీసుకోవాలని తెలిపారు. శిక్షణ తీసుకోవడంతో కొన్ని కొత్త విషయాలను తెలుసుకోవచ్చని వివరించారు. గత ఐదేళ్లుగా తమకు డబ్బులు చెల్లించడం లేదని బీఎల్‌ఓలు ఆర్డీఓకు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే పరిశీలన చేశామని త్వరలోనే డబ్బులు అందేలా చూస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఆర్డీఓ దామోదర్

బీఎల్‌ఓల పాత్ర కీలకం