
కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోం
ములుగు రూరల్: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేశ్ మృతికి మంత్రి సీతక్క కారణమని ఏ–1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని, బీఆర్‌ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోమని పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కేటాయించారని, సీతక్క చల్వాయి గ్రామానికి ఏం చేసిందని వాట్సప్ గ్రూప్‌లో ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకుల బెదింపులకు రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. కాంగ్రెస్ నాయకుల అవినీతి, అక్రమాలు నిలదీస్తూ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపితే పోలీస్ యాక్ట్ అమలు చేశారన్నారు. అదే విధంగా చల్వాయిలో నిరసన చేపడుతుంటే కరెంట్ కట్ చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మంత్రి సీతక్కకు అబద్ధాలు చెప్పడం, రీల్స్ చేయడం తప్ప పనిచేయడం తెలియదన్నారు. శనిగకుంట, బంధాల గ్రామాల్లో ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, కొండాయి ప్రజలకు బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తే ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ శివారులో రామారం, బీమారం, ఉనికిచర్ల, దేవన్నపేట ప్రాంతాల్లో భూదందాలు చేపట్టారని ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు.
బీఆర్‌ఎస్ నియోజకవర్గ
ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి