
హేమాచలక్షేత్రంలో సండే సందడి
● భారీగా తరలివచ్చిన భక్తులు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచలక్షేత్రానికి ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో స్వయంభు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, భీమవరం తదితర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది మంది భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూలు పండ్లు, నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముక్కామల శేఖర్‌శర్మ, రాజీవ్ నాగఫణిశర్మ, స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తుల పేరిట గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదం అందించారు.
బంగారు నేత్రాల బహూకరణ
ఆలయంలో స్వయంభుగా వెలిసిన స్వామివారిని ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందిన భక్తుడు కె.లీలాశివనాగ ధనరాజు(నాని) ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి రూ.76,050 విలువైన బంగారు నేత్రాలను బహూకరించారు.