
ప్రశ్నించే గొంతుకలను నొక్కడం సరికాదు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
ములుగు రూరల్: ప్రశ్నించే గొంతుకలను నొక్కడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా జిల్లాలో పోలీస్ యాక్ట్‌ను అమలు చేయడం సరికాదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హుడైన రమేష్ ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు యాక్ట్‌ను అమలు చేసినట్లు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, కొత్త సురేందర్, భూక్య జవహర్‌లాల్, రవీంద్రచారి, కృష్ణాకర్, వాసుదేవరెడ్డి, విశ్వనాథ్, ఇమ్మడి రాకేష్‌యాదవ్, నాగరాజు, హరీశ్, బాబు, ప్రవీణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.