
విషజ్వరంతో ఒకరి మృతి
మంగపేట: విషజ్వరంతో ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని మల్లూరు గ్రామ పంచాయతీ పరిధి కేసీఆర్ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి భార్య కందుల నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కందుల నాగరాజు(53) మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్యులకు చూపించుకున్నాడు. వారి సూచన మేరకు చుంచుపల్లి పీహెచ్‌సీకి వెళ్లగా గ్లూకోజ్ పెట్టి మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. శనివారం తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లి మృతిచెందాడు. కాలనీలో వైద్యశిబిరం నిర్వహించి 24 గంటలు గడవక ముందే సబ్‌సెంటర్ ఎదురుగా ఉన్న ఇంటి యజమాని విషజ్వరంతో మృతి చెందడంతో జ్వరాలతో బాధపడుతున్న వారు ఆందోళన చెందుతున్నారు. విషయంపై చుంచుపల్లి వైద్యాధికారి యమునను వివరణ కోరగా.. నాగరాజు వైద్యశిబిరానికి వచ్చినపుడు జ్వరం లేదని.. అతిగా మద్యం తాగి ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురైనట్లు గుర్తించామన్నారు. పీహెచ్‌సీలో ఫ్లూయిడ్ పెట్టి మందులు ఇచ్చామని, మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు.

విషజ్వరంతో ఒకరి మృతి