ములుగు రూరల్: ఉద్యోగ విరమణ సహజమని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ఉద్యోగ విరమణ పొందిన బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి చిట్టిరెడ్డి రవీందర్‌రెడ్డిని అదనపు కలెక్టర్ మహేందర్‌జీతో కలిసి శాలువాలతో సోమవారం సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నప్పుడు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. తమ శేషజీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, తహసీల్దార్లు, ఎంపిడీఓలు, మండల అధికారులు పాల్గొన్నారు.
ట్రాఫిక్‌లో చిక్కుకున్న 108 వాహనం
వాజేడు: మండల పరిధిలోని మండపాక వద్ద 163 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం సుమారు అర్ధగంట పాటు 108 అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అక్కడ రహదారికి ఇరువైపులా ఇసుక లారీలను నిలిపి వేయడంతో ముందుకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. దీంతో ఏటురునాగారం వైపు నుంచి వెంకటాపురం(కె) వైపునకు వస్తున్న 108 అంబులెన్స్ లారీల వెనుక నిలిపి ఉంచాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్‌లో రోగులు ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. కాని ఒక వేళ రోగులు ఉంటే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పోక్సో కేసులో ఇద్దరికి జైలు
ములుగు రూరల్: జిల్లాలో ఇద్దరు నిందితులకు పోక్సో కేసులో నేరం నిరూపణ కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఎస్పీ శబరీశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటాపురం(ఎం)పోలీస్‌స్టేషన్‌లో 2022లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మేడిపల్లి భాస్కర్‌కు ఇరవై ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.6వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చినట్లు వివరించారు.
అదే విధంగా వెంకటాపురం(కె)పోలీస్‌స్టేషన్‌లో 2018లో మాచర్ల హరిబాబుపై నమోదైన కేసులో అతనికి ఇరవై ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.11 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని జడ్జీ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. ఈ కేసుల్లో శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.

ఉద్యోగ విరమణ సహజం