
విపత్తుల సమయంలో సహాయక చర్యలు
ములుగు రూరల్: విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం జిల్లాకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ మహేందర్‌జీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామప్ప, లక్నవరం సరస్సు, గోదావరి నది, జంపన్న వాగు నీటిప్రవాహం, గతంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 28 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం వర్షాకాలం ముగిసే వరకు జిల్లాలో ఉంటుందని తెలిపారు. గోదావరి నది, జంపన్న వాగు పరిసర ప్రాంతాలతో పాటు ఊరట్టం, నార్లాపూర్, మేడారం నీటి ప్రవాహ ప్రాంతాలను పరిశీలించి వరదలు వచ్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బృందా నికి కావాల్సిన ఏర్పాట్లను సమకూర్చాల్సిందిగా అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీపీఓ దేవరాజు, కలెక్టరేట్ సెక్షన్ పర్యవేక్షకులు శివకుమార్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు పాల్గొన్నారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
గోవిందరావుపేట: బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల రోజులు పోలీస్‌శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, కార్మికశాఖ చైల్డ్ హెల్ప్‌లైన్, మహిళా సంక్షేమశాఖ అధికారులు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా బాల కార్మికులను గుర్తించి బాలలను రక్షించాలన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎంహెచ్‌ఓ గోపాల్ రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి సంజీవ రావు, సర్వశిక్షా అభియాన్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాజు, అగ్రికల్చర్ ఆఫీసర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర