మాటల మంటలు! | - | Sakshi
Sakshi News home page

మాటల మంటలు!

Jul 3 2025 4:41 AM | Updated on Jul 3 2025 4:41 AM

మాటల మంటలు!

మాటల మంటలు!

స్వపక్షంతోపాటు బీఆర్‌ఎస్‌, బీజేపీకి కార్నరైన కొండా మురళి వ్యాఖ్యలు

మాజీ ఎమ్మెల్సీ తీరుతో కాంగ్రెస్‌ కేడర్‌లో అయోమయం

ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు

స్థానిక ఎన్నికల ముందు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పి

సాక్షి, వరంగల్‌: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాటలు అధికార పార్టీ కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతున్నాయి. విపక్షాలైన బీఆర్‌ఎస్‌, బీజేపీకి కూడా అస్త్రశస్త్రాలు దొరకడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా పోటీచేసిన కొండా సురేఖ రూ.70 కోట్లు ఖర్చు చేశారని స్వయంగా ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు.. ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకొని ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోవైపు బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి కీలక నేతగా చెలామణి అవుతున్న కొండా మురళి మాటలతో అందరికీ కార్నర్‌ అయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరిపై పరోక్షంగా ఘాటైన పదజాలాన్ని ఉపయోగించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇప్పుడు ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎర్రబల్లులేనని విమర్శించడంతో మాటల మంటలకు ఆజ్యం పోసినట్లయ్యింది. దీనికి బదులుగా కొండా మురళిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్న బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు.. నాడు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, నేడు రేవంత్‌రెడ్డి సహకారంతో పదవులు పొందింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీలు, సొంత పార్టీ నేతలు, వరంగల్‌ తూర్పు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఫైర్‌ అయ్యారు. ఇలా కొన్నిరోజుల నుంచే వరంగల్‌ రాజకీయం అంతా కొండా చుట్టూనే తిరుగుతుండడం గమనార్హం. ఇంకోవైపు పరకాల ఎమ్మెల్యేగా కొండా సుష్మితాపటేల్‌ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీలోనే రెండు గ్రూపులవడం, సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement