
విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
ములుగు రూరల్: వర్షాల కారణంగా సంభవించే విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జూలై, ఆగస్టు నెలలో జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు, సలహాలను పాటించాలన్నారు. జిల్లాలో 61 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, 970 శిథిలావస్థలో ఇళ్లు ఉన్నాయని వారంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. ప్రమాద స్థలాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 800 చెరువులు ఉండగా 13 పెద్ద చెరువులు ఉన్నాయని తెలిపారు. వర్షాలకు నిండిన చెరువులను ముందస్తుగా గమనించాలని వివరించారు. లోతట్టు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరుకులను ముందస్తుగా తరలించాలని సూచించారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే ప్రజలు సురక్షత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలలో ఫ్లడ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలో ప్రమాద పరిస్థితిలో ఉన్న 30 గ్రామాల ప్రజలకు రిస్క్ జాకెట్లను అందించామని, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు నీటి ప్రవాహంలో దిగకూడదన్నారు. వర్షం విపత్తును ఎదుర్కొనేందుకు పోలీస్, అగ్ని మాపక, విద్యుత్, వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని గర్భిణులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో 58 పునరావాస కేంద్రాలలో 15 వేల మందికి ఆశ్రయం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ అధికారి రఫీక్, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర