
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు
ఏటూరునాగారం: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఎన్ గార్డెన్‌లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం పదాలను తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్ నేత దత్తాత్రేయవసలే వ్యాఖ్యానించడం దేశ ప్రజలందరినీ అవమానించినట్లేనని తెలిపారు. రాజ్యాంగం మార్పుననకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుట్రలు చేస్తుందని దుయ్యబట్టారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఇద్దరు దళిత యువకులు ఆవు దూడలను తీసుకెళ్తుండగా గోరక్షక దళాల పేరుతో దాడులు చేయడం దారుణమన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 19 వేల మంది దళిత విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.154 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 9వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు ఎండీ.దావుద్ నాయకులు మురళి, రత్నం, దేవయ్య, రమేష్, యశోద, ప్రసాద్, సమ్మయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
స్కైలాబ్ బాబు